

నందమూరి తారకరత్న గారు చనిపోయినప్పుడు పార్టీలకు, కులాలకు అతీతంగా అందరు విషాదంలో నిండి ఉన్న సమయంలో నందమూరి లక్ష్మి పార్వతి గారు ఒక బాంబు పేల్చారు. నందమూరి తారకరత్న కుప్పంలో, పాదయాత్ర మొదటి రోజే మరణించాడని, రాజకీయాల కోసం అతని మరణాన్ని ఇన్నాళ్లు దాచిపెట్టారని ఆమె చంద్రబాబు నాయుడు పై ఆరోపణ చేశారు.
లక్ష్మి పార్వతి గారు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ధర్మపత్ని. కానీ ఇప్పుడు విపక్షంలో ఉన్న రాజకీయనాయకురాలు. ఒక రాజకీయ నాయకురాలిగా చంద్రబాబు నాయుడు పై రాజకీయంగా విమర్శలు చెయ్యవచ్చు, అది న్యాయమే. వారి మధ్య ఉన్న వైరం కారణంగా అది అందరూ ఊహించిందే. కానీ, ఆమె నందమూరి ఇంటిపేరు ఉంచుకున్న ఒక కుటుంబ సభ్యురాలిగా తారకరత్న మరణాన్ని రాజకీయం చెయ్యడం మాత్రం ఎంత మాత్రం న్యాయం కాదు. ఆ సమయంలో అలా మాట్లాడ్డం ఏ మాత్రం సరైంది కాదు.
తారకరత్న కుప్పం లో కూలిపోయినప్పుడు అతని గుండె కాసేపు ఆగిపోయింది అని తెలుగుదేశం వర్గాలు, నందమూరి బాలకృష్ణ తెలిపారు. ఆ తర్వాత అతన్ని బెంగళూరు నారాయణ హృదయాలయ కు తరలించడం, అక్కడ డాక్టర్ ల పర్యవేక్షణ లో ఆయన ఉండి మరణించడం మనందరికీ తెలిసిందే. లక్ష్మి పార్వతి విమర్శ తెలుగు దేశం వర్గాలు చేసిన గుండె ఆగిపోయి మళ్ళీ పని చేసింది అన్న వ్యాఖ్య ను బట్టి చేశారేమో తెలియదు కానీ, చనిపోయిన తారకరత్న ను రాజకీయాల కోసం బ్రతికి ఉంచారు అన్న విమర్శ చంద్ర బాబు కంటే డాక్టర్ లను ఎక్కువ అవమానించడమే.
మన దేశంలో డాక్టర్ ల పై, హాస్పిటల్స్ పై అభిప్రాయం మారడం నిజమే. వారు డబ్బులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారనే మాట వాస్తవమే కావచ్చు కానీ ఒక డాక్టర్ తన చేసే ప్రమాణానికి కట్టుబడి ఉంటాడు. అందులో ప్రపంచ వ్యాప్తంగా పేరుతెచ్చుకున్న నారాయణ హృదయాలయ డాక్టర్ లు ఒక రాజకీయ పార్టీ,అందులో వారి రాష్ట్రంలో లేని, అధికారంలో లేని రాజకీయ పార్టీ కోరిక మేరకు అలా చేస్తారు అనుకోవడం హాస్యాస్పదమే.
మన హాస్పిటల్స్ లో చాలా మంది పేషంట్స్ వెంటిలేటర్ పై చికిత్స పొందుతారు. అందులో చాలా మందికి వారి మెదడు పనిచేస్తూ ఉండకపోవచ్చు. కాకపోతే, వారి కుటుంబ సభ్యుల కోరిక పై వెంటిలేటర్ తీసి వెయ్యరు. అలాగని, వారు మరణించినట్లు కాదు కదా. సహజం గా కానీ, వెంటిలేటర్ సాయం తో కానీ, వారి గుండె కొట్టుకుంటున్నంత సేపు వారు జీవిస్తున్నట్లే. అలాంటప్పుడు, వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్న పేషెంట్ మరణించారు అని ఆమె ఎలా విమర్శిస్తారు.
నేను నందమూరి కుటుంబ సభ్యురాలిని అని లక్ష్మి పార్వతి విమర్శ చేసిన సందర్భంలో కూడా అన్నారు. మరి, తమ కుటుంబ సభ్యులు అంతా విషాదం లో ఉన్న సమయంలో వారిని ఇంకా నొప్పించే ఇలాంటి వ్యాఖ్య చెయ్యడం సబబేనా అని విద్యాధికురాలైన లక్ష్మి పార్వతి గారే ఆలోచించాలి. ఆమె వెనుక ఉండి ఎవరైనా విమర్శ చేయించారేమో తెలియదు కానీ, ఆమె తన కుటుంబ సభ్యుడి మరణాన్ని రాజకీయంగా మార్చడం మాత్రం గర్హనీయమే. ఆమె మాట కు, విమర్శకు అసలు విలువే లేదు కాదండి, మీరెందుకు సమయం వృధా చేసుకుంటారు అంటే నేనేమి చెప్పలేను కానీ మరి విలువ లేని ఆమె విమర్శను అన్ని వెబ్ సైట్స్, చానెల్స్ ప్రసారం/ప్రచురితం చేశాయి కదా. అందుకే ఇలా రాయాల్సి వచ్చింది.
Leave a Reply